ఆసిఫాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అనిల్ మర్మట్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇరుకుల్ల మంగ, సిద్ధాల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని నినాదాలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో స్థానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టరేట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై స్పష్టత, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని వారు కోరారు.
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఆసిఫాబాద్లో ఈ ఆందోళన నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.








