ఛత్తీస్ గఢ్ లోని బొగ్గు గనిలో దొంగలు పడ్డారు. కోర్బాలోని దీప్కా, గెవ్రా ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిపైకి తండోపతండాలుగా దండెత్తిన జనం తట్టలు, బుట్టల్లో అందినకాడికి బొగ్గును ఎత్తుకెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఆ ఘటన తాలూకు వీడియో కాస్తా వైరల్ అయిపోవడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. స్థానిక అధికారులు, పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో దర్యాప్తు సాగించాలని కోర్బా ఐజీ ఆదేశాలిచ్చారు.
కాగా, తాజాగా దొంగతనం జరిగిన గనిని కోర్బా జిల్లా కలెక్టర్ రాణు సాహు, ఎస్పీ భోజ్ రాం పటేల్ లు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు చెందిన ఆ బొగ్గు గనులను పరిశీలించారు. గనుల ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద భద్రతను సమీక్షించారు. అయితే, స్థానిక అధికారులు మాత్రం అసలు ఆ దొంగతనం జరిగింది కోర్బాలో కాదేమోనని ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోపై అనుమానాలున్నాయని చెబుతున్నారు.
ఎస్ఈసీఎల్, సీఐఎస్ఎఫ్ అధికారుల తీరుపై కలెక్టర్ రాణు సాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. గని చుట్టూ కందకాలు తవ్వి పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టాలంటూ ఫిబ్రవరిలోనే చెప్పినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గనుల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ ఇనుప కంచె కూడా వేయమన్నానని, అయినా ఇంతవరకూ వాటికి సంబంధించిన రక్షణ చర్యలేవీ తీసుకోలేదని మండిపడ్డారు. కనీసం గని వద్ద చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు.
గని వద్ద వెంటనే ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రతను పర్యవేక్షించేందుకు ఓ అధికారినీ నియమించాలన్నారు. అయితే, ఇప్పటికే సీఐఎస్ఎఫ్ బలగాలు, త్రిపుర రైఫిల్స్ బలగాలను భద్రత కోసం వాడుకుంటున్నామని ఎస్ఈసీఎల్ అధికారి శనీశ్ చంద్ర చెప్పారు.
#Viral #Video showing people digging up coal and transporting it surfaces from Chhattisgarh's Korba district.
The video allegedly shot at Dipka and Gevra coal mines in Korba has been asked to investigate by @IpsDangi, IG Bilaspur.@TheQuint @QuintHindi pic.twitter.com/JCHylmI0n1
— Vishnukant (@vishnukant_7) May 19, 2022