- మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) మున్సిపల్ కార్పొరేషన్ (MCD Elections)లో 15 ఏళ్ల భాజపా (BJP) పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఊడ్చేసింది.బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి.. ఆప్ 129 స్థానాల్లో విజయం సాధించింది. మరో నాలుగు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మేయర్ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో భాజపా 101 వార్డులను దక్కించుకోగా.. మరో నాలుగు చోట్ల ముందంజలో ఉంది. భాజపా దిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా నియోజకవర్గం పటేల్ నగర్‌లోని నాలుగు వార్డుల్లోనూ కాషాయ పార్టీ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఈ ఫలితాల్లో హస్తం పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. మరో నాలుగు చోట్ల ఇతరులు విజయం సాధించారు.
1958లో ఏర్పాటైన ఎంసీడీ (MCD)ని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దశాబ్దంన్నర పాటు భాజపానే అధికారంలో ఉంది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో భాజపా 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ.. దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆప్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
దిల్లీ అసెంబ్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను అరవింద్ కేజ్రీవాల్ పెకిలించారు. ఇప్పుడు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపాను కూడా గద్దెదించారు. విద్వేష రాజకీయాలను దిల్లీ ప్రజలు ఇష్టపడటం లేదని రుజువైంది. స్కూళ్లు, ఆసుపత్రులు, విద్యుత్, పరిశుభ్రతకే వారు ఓటేశారు – పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్
భాజపాకు దిల్లీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అభివృద్ధి కోసం పనిచేసిన వారికే ఓటేశారు. అరవింద్ కేజ్రీవాల్‌పై భాజపా చల్లుతున్న బురదను ప్రజలు తుడిచేశారు. ఇక, మేం దిల్లీని ప్రపంచంలోనే అందమైన నగరంగా మారుస్తాం – ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా