contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మమ్మల్ని మనుషులుగా గుర్తించండి.. రోడ్డు సౌకర్యం కల్పించండి

రావికమతం : కనీస రహదారి సౌకర్యం కల్పించాలంటూ అనకాపల్లి జిల్లా రావికమతం, వి.మాడుగుల మండలాల పరిధిలోని సామలమ్మ కొండపై నివసిస్తున్న పీవీటీజీ కొందు గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు కోసం గుర్రాలతో సుమారు మూడు కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించి తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

సామలమ్మ కొండపై సుమారు 22 కొందు గిరిజన కుటుంబాలకు చెందిన 120 మంది నివసిస్తున్నారని గిరిజన సంఘం నాయకులు తెలిపారు. బంగారు బందల నుంచి జీలుగులోవా, సోంపురం బందలు మీదుగా పశువుల బంద గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

“మా గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించండి.. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి” అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. రహదారి కోసం పలుమార్లు ఆందోళనలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.3 కోట్లతో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని తెలిపారు. చోడవరం–మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యేను పలుమార్లు కలిసి రాతపూర్వకంగా వినతిపత్రాలు అందజేసినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు.

నాన్‌-షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసిస్తున్న పీవీటీజీ గిరిజనుల సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మైదాన ప్రాంతాల్లో పశువులు వెళ్లే మార్గాలకు సైతం సీసీ రోడ్లు నిర్మిస్తున్నారని, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న తమకు మాత్రం కనీసం నడిచేందుకు కూడా రహదారి లేకపోవడం బాధాకరమని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ వంటి నినాదాలు ఇస్తూ భారీ రహదారులు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నప్పటికీ, తమ గ్రామాలకు సాధారణ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా తమకు కనీస మౌలిక సదుపాయాలు అందకపోవడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆశా కార్యకర్తను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కే. గోవిందరావు, పీవీటీజీ సంఘం నాయకులు సేదరి కామేశ్వరరావు, గేమిల వాసు, వంతల దాసు, సేదరి చిలుకమ్మ, సేదరి రాజబాబు, కుర్ర బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :