విజయనగరం: విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆలస్యంగా సాయంత్రం 5గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా.. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 3 లాంతర్లు మీదుగా కోట వరకు 3 సార్లు సిరిమాను ఊరేగింపు జరిగింది. ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కోట బురుజు మీద నుంచి ఉత్సవాన్ని తిలకించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఉప సభాపతి కొలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్య కుమారి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు డీసీసీబీ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఉత్సవాన్ని వీక్షించారు. సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో విజయనగరం జనసంద్రంగా మారింది.