వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆయనపై ఎస్‌పీ హర్ష వర్ధన్ రాజుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్వీ గోశాలలో 100 ఆవులు మరణించాయని… పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భానుప్రకాశ్‌రెడ్డి… భూమనపై తీవ్ర విమర్శలు చేశారు. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే పెద్ద సంఖ్యలో గోవులు మృత్యువాత పడ్డాయన్నారు. వైసీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆరోపించారు. వారి హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు.
టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందుడు, గోవులతో ఆటలొద్దని వైసీపీ నేతలను భానుప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు.