అనంతపురం బార్ అసోసియేషన్‌కు చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి, ఆయన మృతికి కారణమైన అనంతపురం త్రీటౌన్ సీఐ శాంతిలాల్‌ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు న్యాయవాదులు డిమాండ్ చేశారు. శుక్రవారం న్యాయవాదులు సీఐ శాంతిలాల్ చర్యకు వ్యతిరేకంగా కోర్టు గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్. సిరాజుద్దీన్, న్యాయవాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక సివిల్ కేసు విషయంలో న్యాయవాది శేషాద్రిని శనివారం రోజున అనంతపురం త్రీటౌన్ సీఐ శాంతిలాల్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి దండించినందుకు తీవ్ర మనస్థాపానికి గురైన శేషాద్రి సీఐ ఛాంబర్‌లోనే గుండెపోటుకు గురై చనిపోయాడన్నారు. శేషాద్రి వెంట వెళ్లిన జూనియర్ న్యాయవాదులను పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి అనుమతించకపోవడం శోచనీయమన్నారు. సివిల్ కేసులో జోక్యం చేసుకోవద్దంటూ సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్నా సీఐ శాంతిలాల్ ఖాతరుచేయకపోవడం దారుణమన్నారు. న్యాయవాది మృతికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం వెంటనే వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలానే అడ్వకేట్ సురేష్ మాట్లాడుతూ శేషాద్రి మృతిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వం వెంటనే విచారణ కి ఆదేశించి భద్యులైన పోలీసుల పై చర్య తీసుకోవాలని కోరుతూ అనంతపురం న్యాయ వాదులు ఉద్యమానికి మద్దతుగా కోర్టు విధుల బహిస్కరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కేవీ శేషారెడ్డి, ఎల్వి రమణయ్య,నంద ఓబులేసు, హరికృష్ణ, తిరుపతమ్మ, రహమతున్నేసా, సురేష్ మల్లికార్జున, రసూల్ పాల్గొన్నారు.