నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలం, అక్బర్ నగర్ గ్రామం: సమాచార హక్కు చట్టం కార్యకర్త మరియు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యుడు బురిగేడి సంజీవ్ అనే వ్యక్తి పై మరియు అతని సోదరులు నిఘా పత్రిక రిపోర్టర్ గంగారాం, అశోక్ ల పై హత్యాయత్నం జరిగింది. అడ్డుకోబోయిన తన కుటుంబ సభ్యుల పై భౌతికి దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలం, అక్బర్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గతంలో (2020) ఉపాధిహామీ పథకం అవకతవకలపై మరియు అక్రమ భూ కబ్జాలపై సంజీవ్ అనబడే వ్యక్తి RTI దాఖలు చేయడం జరిగింది. పైన పేర్కొనబడిన ఉపాధి హామీ పథకం అవకతవకలు, భూ కబ్జాలకు కారణం అయిన అదే గ్రామానికి చెందిన నీరడి శంకర్ అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు అప్పటి నుండి కక్ష్య పెట్టుకొని సంజీవ్ పైన అతని కుటుంబ సభ్యులపైన అడుగడుగునా దాడులకు పాల్పడుతూ ఉన్నారు. 6 నెలల క్రితం స. హా. చట్టం కార్యకర్త సంజీవ్ సోదరులలో ఒకరైన నిఘా పత్రిక రిపోర్టర్ గంగారాం పైన హత్యాయత్నం జరిగింది. మళ్ళీ నిన్న రాత్రి (ఆదివారం 09-10-22 ) 8 గంటల సమయంలో సంజీవ్ మరియు అతని సోదరులు గంగారాం, అశోక్ లపైన మారణాయుదాలైన కత్తులు, పంచులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సంజీవ్ వదినను 8 నెలల గర్భవతి అని చూడకుండా కాలితో తన్నడం పలువురిని కంటతడి పెట్టించింది. ప్రస్తుతం గర్భవతి క్షేమంగ ఉండగా, తలకి బలమైన గాయాలు కావడం వలన సంజీవ్ మరియు అతని సోదరులు గంగారాం, అశోక్ లు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో SICU లో చికిత్స పొందుతున్నారు. తలకి బలమైన గాయాలతో, రక్తపు స్థితిలో ఉన్న సంజీవ్, గంగారాం లను రుద్రూర్ పోలిస్ స్టేషన్ SI రవీందర్ గారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వారి పోలీసు వాహనంలో మొదటగా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ హత్యాయత్నం, దాడికి పాల్పడిన నీరడి శంకర్ మరియు అతని కుటుంబ సభ్యులు అయినటువంటి రవి, రామకృష్ణ, వంశీ, వరుణ్, బాలయ్య, ఎడపల్లి శేఖర్ లను చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
