గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మూడు రోజుల పాటు పర్యటన ఆదివారం ప్రారంభమైంది. ఈనెల 11వ తేదీ వరకూ ఆయన జరుపనున్న పర్యటనలో రూ.14,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయనప్రారంభించనున్నారు.మెహ్‌సానాలోని మొథేరాలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అధికారిక సమాచారం ప్రకారం, భరూచ్‌లోని జంబుసార్ వద్ద బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అహ్మదాబాద్‌లో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఫేజ్-1ను ప్రారంభిస్తారు. అసర్వాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.1,3000 కోట్లతో హెల్త్‌కేర్ ఫెసిలిటీస్‌కు శంకుస్థాపన చేస్తారు. జామ్‌నగర్‌లో నీటిపారుదల, విద్యుత్, నీటి సరఫరా, పట్టణ మౌలిక సదుపాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. పర్యావరణ హిత ఇంధనాన్ని ప్రమోట్ చేసే దిశగా దేశంలోనే తొలి సౌరశక్తి గ్రామంగా మెహసానా జిల్లాలోని మొథేరాను అధికారికంగా మోదీ ప్రకటించనున్నారు. గ్రామాల్లోని అన్ని గృహాలకు 1,000కు పైగా సోలార్ ప్యానల్స్‌ను గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తద్వారా ఉచితంగానే ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను అందిస్తోంది. మొథేరాలోని సూర్యాలయానికి ఆదివారం నుంచి 3-డి ప్రొజెక్షన్ సౌకర్యం కల్పించనున్నారు. సోలార్ పవర్ 3-డి ప్రొజక్షన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయం ఆవరణలో హెరిటేజ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని 1026-27లో చాళుక్య వంశానికి చెందిన కింగ్ భీమా-I నిర్మించారు.