కనిగిరి: మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సీపీఐ చేపట్టిన ప్రచార పాదయాత్రలో భాగంగా మంగళవారం కనిగిరిలోని హనీఫ్ స్థూపం నుంచి క్లబ్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ యాసిన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సాగిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 31న నూతన మార్కాపురం జిల్లాను ప్రకటించిందన్నారు. జిల్లా ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అధికారుల నియామకాలు జరగకపోవడంతో పరిపాలన సక్రమంగా సాగడం లేదని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి వంటి వెనుకబడిన నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ, అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాబోయే బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తేనే జిల్లాలో మౌలిక వసతులు, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, సాగునీటి రంగాల్లో కొంతమేర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రూ.25 వేల కోట్ల ప్రత్యేక నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
మార్కాపురం జిల్లాకు వరప్రదాయినిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం మూడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉందని ఈశ్వరయ్య అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 జూలై 1 నుంచి నీరు అందిస్తామని ఇచ్చిన హామీ అమలుపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు.
ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని పూర్తిగా పరిష్కరించాలని, 2025 డిసెంబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను గుర్తించి వారికి కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలంటే మరో రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అవసరమవుతుందని, ఆ నిధులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు నెలకొన్నాయని ఈశ్వరయ్య అన్నారు. ఆగస్టు నెల ప్రారంభమైనప్పటికీ మార్కాపురం జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో 21 మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తక్షణమే మార్కాపురం జిల్లాను తీవ్ర కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు పంట నష్టపరిహారం, సాగుకు అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కోరారు.
మార్కాపురం జిల్లా నిత్యం కరువు, వలసలతో సతమతమవుతోందని, విద్య, వైద్యం, పరిశ్రమలు, నీటిపారుదల, వ్యవసాయం వంటి రంగాల్లో తగిన అభివృద్ధి లేకపోవడంతో ఉపాధి కోసం కుటుంబాలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించి ప్రజలకు వైద్య విద్య, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లాలోని చెరువులను వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకువచ్చి సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌డీఏ కూటమి అనుసరిస్తున్న ప్రజా, రైతు, వ్యవసాయ, కార్మిక, విద్యార్థి, మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ “మార్పు కావాలి” నినాదంతో సెప్టెంబర్ 1న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని, మహిళలకు భద్రత కల్పించాలని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలని, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయడంతో పాటు ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని కోరారు.
మహిళలపై జరుగుతున్న హింస, అఘాయిత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు వై. రవీంద్రబాబు, పోతల ప్రభాకర్, కనిగిరి మండల కార్యదర్శి గులాం హుస్సేన్, పామూరు మండల కార్యదర్శి మస్తాన్ రావు, సీఎస్‌పురం మండల కార్యదర్శి పెద్ద మస్తాన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మోహన్, మౌలాలి, సీపీఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








