మంచిర్యాల జిల్లా…చెన్నూరు భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ భాద్యతగా వినియోగించుకొని సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి చెన్నూరు పట్టణంలోని తెలంగాణా తల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈవీఎం ద్వారా ఓటు వేసే పద్దతిపై కళాకారులతో అవగాహనా కార్యక్రమంలో అన్నారు. ఈ నెల 30న జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజు అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని, గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో కేవలం 73 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, రానున్న ఎన్నికల్లో అందరూ భాద్యతగా ఓటు వేసి ఎన్నికల్లో తమ భాద్యత నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా, నిస్పక్షపాతంగా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని, తద్వారా సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రిటర్నింగ్ అధికారి సిదాం దత్తు, చెన్నూరు తహసీల్దార్ మల్లిఖార్జున్, భీమారం తహసీల్దార్ విశ్వంబర్, చెన్నూరు మున్సిపల్ కమిషనర్ గంగాధర్, చెన్నూరు ఎలక్షన్ డీటీ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.