ఆయా పార్టీల నేతలు రోడ్డు షోలను సెలవు రోజుల్లో పెట్టుకోవాలని.. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు షోలకు అనుమతిలేదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. సోమవారం బీఆర్కే భవన్‌లో ఆయన ఎన్నికల సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను, స్కూల్ డ్రెస్‌లకు కూడాఅనుమతి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 8 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. నామినేషన్ ఉపసంహరణ తర్వాత రోజు నుంచి హోంఓటింగ్ ప్రారంభమవుతుందన్నారు.
పోస్టల్ ఓటింగ్‌ను ఈసారి కొత్త సాప్ట్‌వేర్‌తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయిందన్నారు. పోలింగ్ కోసం ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని, రిజర్వ్ ఈవీఎంలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక కోసం అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు. 1.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల కోసం పని చేయాల్సి ఉందన్నారు. 24 గంటలు పని చేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు.
రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్లు అందుబాటులో ఉండాలని, లేదంటే సీజ్ చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ జరుగుతుందన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే సీ-విజిల్ యాప్ లేదా 1950కి ఫోన్ చేసి ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతిని సువిధా యాప్ ద్వారా తీసుకోవాలని సూచించారు. 7 లక్షల ఓటర్ కరెక్షన్లను అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి చేశామన్నారు. తెలంగాణలో చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా… అతిపెద్దది మల్కాజ్‌గిరి అని పేర్కొన్నారు.