హైదరాబాద్ : ప్రస్తుతం తెలంగాణలో మహిళలు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల వారికి నెల నెలా ఎంతో కొంత డబ్బు మిగులుతోంది. అలాగే ఊళ్లకు వెళ్లాలి అనుకునేవారు కూడా ఉచిత ప్రయాణం చేస్తూ తమ వారిని చేరుకుంటున్నారు. ఇలా మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ పథకం వారికి బాగా మేలు చేస్తోంది. అయితే .. ఇది రద్దవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ హైకోర్టులో గురువారం ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ వేశారు. నాగోలుకు చెందిన ఈ ఉద్యోగి.. ఇలా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం అనేది వివక్ష కిందకు వస్తుంది అని పిటిషన్‌లో తెలిపారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పడిన ఆర్టీసీలో.. ఉచిత ప్రయాణం కల్పించేలా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనీ, అందువల్ల ఈ పథకాన్ని ఆపేయమని ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
బస్సుల్లో చాలా మంది మహిళలు అవసరం లేకపోయినా ప్రయాణిస్తున్నారనీ, దీని వల్ల అవసరమై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతోందని అన్నారు. అంతేకాదు.. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై భారం పడుతోందనీ, ఇలాంటి భారాన్ని ప్రభుత్వం భరించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాల్సిందిగా ఆదేశించే అవకాశాలూ ఉన్నాయి. ఐతే.. నిపుణులు మాత్రం.. ఈ పథకాన్ని రద్దు చేసే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఇది అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి.. దీన్ని రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉండకపోవచ్చు అంటున్నారు. ఐతే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పథకాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదు కాబట్టి.. ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.