అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించిన నేపథ్యంలో దేశంలో గ్యాస్ ధరలు తగ్గాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర సోమవారం రూ.36 తగ్గింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.
తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రూ 2012.50 నుంచి రూ. 1,976కి దిగిందని ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు తెలిపారు. ముంబైలో రూ. 1972.50గా ఉన్న వాణిజ్య సిలిండర్ ధర రూ. 1936.50కి పడిపోయింది. హైదరాబాద్‌లో 19 కిలోల సిలిండర్ ధర రూ.2197.50 అందుబాటులోకి వచ్చింది.
కాగా, గత నాలుగు నెలల్లో భారత్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లపై ధర తగ్గడం ఇది నాలుగోసారి. ఇది వరకు జూన్‌లో, కేంద్ర ప్రభుత్వం 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ల ధరలను రూ.135 చొప్పున తగ్గించింది. మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర జులై 7న రూ. 50 పెరిగింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1090.50గా ఉంది.