జర్నలిస్టు అంకబాబు అరెస్ట్, ఆ అరెస్ట్ ను నిరసిస్తూ నిరసనకు దిగిన జర్నలిస్టులు వంశీ కృష్ణ, కృష్ణాంజనేయులు తదితరులను అరెస్ట్ చేసిన ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని ప్రశ్నించిన పవన్… ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతగా రియాక్ట్ అయ్యిందంటే.. అందులో ఏదో మతలబు దాగుందని అన్నారు. అసలు అంకబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనే లేదని కూడా పవన్ ఆరోపించారు.
సింగిల్ పోస్టును షేర్ చేస్తేనే అంకబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. నేతలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన కామెంట్లు పోస్ట్ చేస్తున్న వైసీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా పోస్టులు పెట్టిన కేసును సీఐడీ అధికారులు ఏ రీతిన దర్యాప్తు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికీ ఇంకా కొందరిని అరెస్టే చేయలేదని కూడా పవన్ గుర్తు చేశారు.
అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/FYWKJYgLm4
— JanaSena Party (@JanaSenaParty) September 23, 2022