contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు.. యువత భవిష్యత్తుకు ముప్పు

అమరావతి: రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాలు యువత ఆయుష్షును, జీవితాలను దెబ్బతీస్తున్నాయని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర సామాజిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాష్ట్రంలో మద్యం వినియోగం, యువతపై దాని ప్రభావం, అక్రమ విక్రయాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తదితర అంశాలపై 12 అంశాలతో కూడిన సమగ్ర నివేదికను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత జనాభా సుమారు 1.45 కోట్ల వరకు ఉందని, ఈ వయసు వర్గంలో మత్తు పదార్థాల వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉందని పేర్కొన్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర గణాంకాలను ప్రస్తావిస్తూ యువతలో చిన్న వయసులోనే మద్యపాన అలవాటు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సులభంగా అందుబాటులో ఉండటం వల్ల యువత ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా 25 ఏళ్లలోపు వారిలో కాలేయ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి, నరాల బలహీనత వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా వేలాది మద్యం దుకాణాలు, బార్లు కొనసాగుతున్నాయని రమణరాజు తెలిపారు. వీటికి అదనంగా పెద్ద సంఖ్యలో అనధికార బెల్ట్‌ షాపులు గ్రామాలు, పట్టణాల్లో విస్తరించి ఉన్నాయని ఆరోపించారు. సులభంగా మద్యం లభించే పరిస్థితిని నియంత్రించకపోతే యువతపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.

ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే దృష్టి కాకుండా, దాని వల్ల సమాజంపై పడుతున్న ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైన భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అక్రమ మద్యం, నాటుసారా, స్మగ్లింగ్‌ వంటి కార్యకలాపాలు కూడా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని యువత ప్రాణాలు కోల్పోతున్నారని రమణరాజు పేర్కొన్నారు. పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాలను పూర్తిగా నియంత్రించలేకపోతున్నామని అన్నారు.

జరిమానాలు, కేసులు, శిక్షలతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపకుండా కుటుంబాలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

రూ.99 వంటి తక్కువ ధరల పేరుతో మద్యాన్ని సామాన్యులకు మరింత చేరువ చేయడం తగదని రమణరాజు అన్నారు. బార్ల నిర్వహణ సమయాన్ని అర్ధరాత్రి వరకు పొడిగించే నిర్ణయాలను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అనధికార బెల్ట్‌ షాపులను పూర్తిగా నిర్మూలించాలని కోరారు.

మద్య వ్యసన విముక్తి కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయిలో మద్యపాన వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మద్య వ్యసనానికి గురైన వారిని గుర్తించి ఆరోగ్య కేంద్రాలకు తరలించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపాన విముక్తి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని రమణరాజు డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు, వైద్య శాఖ, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మద్యం విక్రయాల నియంత్రణలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే యువత రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :