కరీంనగర్ జిల్లా – గన్నేరువరం: కన్నతల్లిని ఇంటి నుంచే గెంటేసిన కసాయి కొడుకులపై “రిపోర్టర్ టీవీ”లో శుక్రవారం ప్రసారమైన కథనం స్పందనను రాబట్టింది. గన్నేరువరం మండలకేంద్రానికి చెందిన వృద్ధురాలు వొడ్నాల లచ్చవ్వ (వయస్సు 95) ను కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి గెంటివేయడం ప్రజల్లో ఆవేదన రేకెత్తించింది.
ఈ ఘటనపై స్పందించిన తహసీల్దార్ జక్కని నరేందర్, గిర్ధవర్ కె. రఘు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని లచ్చవ్వ కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. వృద్ధురాలిని తిరిగి కుమారుని ఇంటిలోకి పంపిస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
రెవెన్యూ అధికారుల ఈ చొరవను గ్రామస్థులు అభినందించారు. వృద్ధురాలికి న్యాయం జరిగిందని, అధికారులు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా “రిపోర్టర్ టీవీ” ప్రతినిధి రాజ్ కోటికి ఎమ్మార్వో నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాలను వెలికి తీసే పాత్రికేయుల పట్ల అధికారులు గౌరవం చూపడం అభినందనీయం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.










