గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీపీఐ చేపట్టిన ప్రచార జాతా ఐదో రోజు గన్నేరువరం మండలంలో కొనసాగింది.
సీపీఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కాల్ల శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కలవేన శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధానాలను కేంద్రం వేగంగా అమలు చేస్తోందని ఆరోపించారు.
రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించిన ఉద్యమాలను ఈ సందర్భంగా శంకర్ గుర్తుచేశారు. ఆ పోరాటంలో 750 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రైతుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని, ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.
దేశంలో నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహిళల రక్షణ విషయంలోనూ కేంద్రం విఫలమైందని, పోరాటాల ద్వారా సాధించుకున్న మహిళా రిజర్వేషన్‌ను ఇప్పటికీ సమర్థవంతంగా అమలు చేయడం లేదని అన్నారు. కార్మిక హక్కులను పరిరక్షించే చట్టాలను బలహీనపరుస్తూ, సమాన పనికి సమాన వేతనం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో లేకుండా పోయాయని కలవేన శంకర్ అన్నారు. విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లో వ్యాపారంగా మారాయని ఆరోపించారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు, వైద్యుల కొరత తీవ్రంగా ఉందన్నారు.
మండల కేంద్రాల్లో ఆసుపత్రులు నిర్మించి వైద్యులను నియమిస్తామని పాలకులు హామీలు ఇచ్చినా, అనేక చోట్ల ఆసుపత్రులు నిర్మించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తేనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. దేశంలో మార్పు కోసం సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి కమ్యూనిస్టులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తోందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. అర్హులైన పేదలకు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలంతా ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార జాతాలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జాతా కోఆర్డినేటర్లు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మీ, నాగెల్లి లక్ష్మారెడ్డి, గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కాల్ల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, బీర్ల పద్మ, కొట్టె అంజలి, మండల సహాయ కార్యదర్శులు కూన మల్లయ్య, పిప్పళ్ల కనుకయ్య, భవన నిర్మాణ సంఘం మండల కార్యదర్శి మైసంపల్లి మల్లేశం, గ్రామ శాఖ కార్యదర్శులు బోయిని తిరుపతి, బోయిని మల్లయ్య, చెరుకు ఆంజనేయులు, గాజుల లక్ష్మణ్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మోలుగురి ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ముల్కల పవన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








