మెదక్ జిల్లా: మాసాయిపేట మండలం నాసాన్‌పల్లి గ్రామంలో ముదిరాజులు ఐక్యతను చాటుతూ ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ బీసీ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముదిరాజ్ యువకులు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
కర్ణాటకలోని బెంగళూరులో కొనసాగుతున్న బీసీ ఉద్యమానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముదిరాజ్ యువకులు సత్యనారాయణ, రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తమకు దక్కాల్సిన హక్కులు, అవకాశాలు పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునేందుకు బీసీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా బీసీ యువతను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అయితే అభివృద్ధి, విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీల హక్కుల కోసం కర్ణాటకలో ప్రారంభమైన ఉద్యమానికి తెలంగాణ నుంచి కూడా మద్దతు అందిస్తామని తెలిపారు. తమ హక్కుల సాధన కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని సత్యనారాయణ అన్నారు.
జెండా ఆవిష్కరణ అనంతరం యువకులు ‘జై ముదిరాజ్’ నినాదాలతో హోరెత్తించారు. టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీసీ హక్కుల సాధన కోసం ఐక్యతే ప్రధాన బలమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు చింతల సత్యనారాయణ, వదునాల రాకేష్, వదునాల స్వామి, కుక్కదువు సందీప్, కుక్కదువు నాగరాజు, కుక్కదువు రవి, కుక్కదువు శంకర్, కుక్కదువు గణేష్, కుక్కదువు సంజీవ్, జింక భాస్కర్, జింక పవన్, జింక సుదర్శన్, ఇమ్మడి విజయ్, ఘనపురం సునీల్, కుక్కదువు ప్రేమ్ కుమార్, కుక్కదువు ప్రశాంత్, కుక్కదువు కరుణాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.









