contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పొరుగు రాష్ట్రాల ప్రజలకు ఉపాధి ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది: హరీష్ రావు

  • త్రాగు, సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాం.
  •  ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను 30 శాతం నుంచి 70 శాతం కు పెంచాం.
  • రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు.
  • పదేండ్లలో ఇల్లంతకుంట అత్యద్భుత ప్రగతి సాధించింది
  • ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కావాలంటే కూడా కైకిలి దొరకక గొసపడ్డ తెలంగాణ ప్రజలు…. స్వరాష్ట్రం తెలంగాణలో పొరుగు రాష్ట్రాలు, ఉత్తర భారత దేశ ప్రజలకు కూడా ఉపాధి ఇచ్చే స్థాయికి చేరిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.శుక్రవారం సాయంత్రం ఇల్లంతకుంట కు హెలికాప్టర్ లో చేరుకున్న మంత్రి హరీష్ రావు కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్,స్థానిక శాసన సభ్యులు రసమయి బాలకిషన్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

ఆ వెంటనే మంత్రి ఇల్లంతకుంట లో 37 లక్షల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు . అనంతరం 17 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు భూమిపూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని, పల్లె దవాఖానను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడారు. ఒకప్పుడు కోసం త్రాగునీటి కోసం, సాగునీటి కోసం గోసబడ్డ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలమైందని మంత్రి తెలిపారు. ఇక్కడ ఒకప్పుడు పంట అంటే పత్తి పంట అని ఇప్పుడు సమృద్ధిగా జలాలు లభించడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. గతంలో ఎమ్మెల్యే ఇల్లంతకుంట రావాలంటే ముందు పోలీసు బండో, బోరు బండో ఉంటే తప్ప వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. త్రాగునీటి కి కటకట ఉండడంతో బిందెలు అడ్డుపెట్టి ప్రజా ప్రతినిధులకు మహిళలు స్వాగతం పలికేవారన్నారు.కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకంతో సురక్షిత త్రాగునీరు నల్లా ద్వారా అందిస్తున్నామని మంత్రి తెలిపారు.రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు, రైతుభీమా తో పాటు
సకాలంలో ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు… అనే పరిస్థితి నుంచి ఆరోగ్యం బాగు కావాలంటే సర్కారు దవాఖానకే పోవాలి అనే పరిస్థితి వచ్చింది అన్నారు. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 30% ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో అయితే 70% ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రిలో అయ్యేవన్నారు. కానీ ఇప్పుడు 70% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అవుతుండగా 30% ప్రసవాలు మాత్రమే ప్రైవేటు ఆసుపత్రిలో అవుతున్నాయన్నారు. 100 % ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అయితే కేసీఆర్ కిట్టు తో పాటు న్యూట్రిషన్ కూడా అందరు ఉండడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది అన్నారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఓ సందర్భంలో నన్ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. తమ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని స్టాప్ కు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బలోపేతమయ్యాయో ,పేద ప్రజలకు ఎంత ఆర్థిక భారం, దూర భారం తగ్గింది అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

ఇల్లంతకుంట కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల , సిద్దిపేట జిల్లా కేంద్రాలకు మధ్యలో ఉంటుందన్నారు. అరగంట సమయంతో మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు ఉన్న ఈ మూడు చోట్లకి వెళ్ళవచ్చును అన్నారు. ఇదే ఉద్దేశంతో ఇల్లంతకుంట మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రి కావాలని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే అడిగిన కొంత సంశయించానని మంత్రి తెలిపారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ,స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పదేపదే అడగడంతో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందన్నారు.

50 పడకల ఆసుపత్రి తో ఇక్కడ కనీసం 8 మంది వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు రాత్రిపూట కూడా వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని మంత్రి తెలిపారు.వీటి తో పాటు మహిళలకు అండగా ఉండేందుకు కల్యాణ లక్ష్మి , పెద్ద ఎత్తున గురుకుల డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.పదేండ్లకు ముందు ఇల్లంతకుంట ఎట్లా ఉందో పదేళ్ల తర్వాత ఇల్లంతకుంట ఎట్లా ఉందో ఒక్కసారి ప్రజలు బేరీజు వేసుకోవాలని మంత్రి తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజల అభివృద్ధికి కృషి చేసిన ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండగా ఉండాలని, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలను కోరారు.అనంతరం
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశీస్సులు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ల సహకారంతో ఇల్లంతకుంట సాగు, త్రాగు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, ఇలా అన్ని రంగాలలో అత్యద్భుత ప్రగతి సాధించిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్, మాజి చైర్మన్ చింతపల్లి వేణు రావు, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :