ఎక్స్(గతంలో ట్విట్టర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా అనుసంధాన వేదికలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ చేసింది. అలా చేయలేదంటే సేఫ్ హార్బర్ హోదాను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను తమ తమ సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని సూచించింది.
అలాంటి కంటెంట్‌కు యాక్సెస్ లేకుండా చేయడం లేదా శాశ్వతంగా తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. భవిష్యత్తులోనూ ఇలాంటి కంటెంట్‌ను నిరోధించేందుకు పర్యవేక్షణ, నియంత్రణ, రిపోర్టింగ్ అల్గారిథంలలో మార్పులు చేసుకోవాలని సూచించింది. చర్యలు తీసుకోకుంటే మాత్రం ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కల్పిస్తోన్న సేఫ్ హార్బర్ హోదాను ఉపసంహరించుకుంటామని కేంద్రం తెలిపింది.