ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఇండియాలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్ కు ఆయన వెళ్లొచ్చినట్టు సమాచారం. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించారు. లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మగా ఒక మంత్రి వ్యాఖ్యానించగా, మరో ఇద్దరు భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు మంత్రులను అక్కడి ప్రభుత్వం పదవుల నుంచి తప్పించింది. మరోపక్క, ఇదే విషయమై భారత విదేశాంగ శాఖ ఆ దేశ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసింది.