మెట్పల్లి, జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన జంగిటి రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు ఇది తొలి సంతానం. రాజలక్ష్మికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మెట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రసవం చేయగా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు.
వారిలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. పుట్టిన బాబు 1.8 కిలోల బరువు ఉండగా, మొదటి పాప 1.5 కిలోలు, రెండో పాప 1.4 కిలోల బరువుతో జన్మించారు.
ముగ్గురు శిశువులు తక్కువ బరువుతో జన్మించడంతో పిల్లల వైద్య నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లితో పాటు ముగ్గురు శిశువులు కూడా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడంతో రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు బంధువులు, స్థానికులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.









