మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపు ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చేపట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. నిర్వాసితులను ఎలాంటి ఒత్తిడికి గురిచేయకుండా, స్నేహపూర్వక వాతావరణంలో సున్నితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
ఈ నెల 22న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ట్రయల్ రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజల పునరావాసం, మౌలిక వసతులు, ఇతర సమస్యలపై బుధవారం మార్కాపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులతో అధికారులు సామరస్యంగా చర్చించి, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ పునరావాస ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. పరిహారం విషయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రత్యేక కమిటీలతో తరలింపు
ముంపు ప్రాంతాలైన సుంకేసుల, కలనూతల, గుండెచర్ల, గొట్టిపడియ, చింతల ముడిపి, కాటమరాజు తండా, లక్ష్మీపురం, కృష్ణానగర్, అక్కచెరువు గ్రామాల ప్రజలను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమగ్ర ప్రణాళికతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆర్అండ్ఆర్ కాలనీల్లో మౌలిక వసతులు
పునరావాస కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్టులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర మౌలిక వసతుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ట్రయల్ రన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తరలింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్ బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, జిల్లా మైనింగ్ అధికారి రవి ప్రసాద్, డ్వామా పీడీ సువార్త, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్, డీఈఓ సుబ్బారావు, వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








