నెల్లూరు జిల్లా/ మర్రిపాడు : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పులి మృతి చెందింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడ జాతీయ రహదారిపై వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చిరుత పులి తీవ్ర గాయాలతో సుమారు గంట పాటు కొట్టుమిట్టు లాడిందని పలువురు వాహన దారులు వెల్లడించారు. చిరుతను కాపాడేందుకు ఎవ్వరూ ముందుకు వెళ్లేందుకు సాహసించలేదని వారు తెలిపారు.
చిరుత పులి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును వాహనదారులను, స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిరుతను ఢీకొన్న వాహనదారుల వివరాలు తెలియాల్సి ఉంది.