- శృతి చదువుకు ఆర్ధిక అవసరాలు ఆటంకాలు
మర్రిపాడు, నెల్లూరు జిల్లా: పేదరికం ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తూ విద్యా వెలుగుతో తన కుటుంబానికే కాదు, సమాజానికీ స్ఫూర్తిగా నిలిచింది మర్రిపాడు మండలం అనంతపురం గ్రామానికి చెందిన పాగల శృతి. పదవ తరగతి పరీక్షల్లో అద్భుతంగా 571 మార్కులు సాధించిన ఆమె, ట్రిపుల్ ఐటి ఒంగోలు క్యాంపస్‌లో ప్రవేశం సాధించి గ్రామ గర్వంగా నిలిచింది.
చిన్నప్పుడే తండ్రి వదిలిపెట్టిన శృతికి, తల్లి మస్తానమ్మ కూలి పని చేస్తూ ముగ్గురు పిల్లలను చదివిస్తోంది. అన్నయ్య గత సంవత్సరం 550 మార్కులు సాధించినా ట్రిపుల్ ఐటి చేరలేక స్ధానిక సంగం జూనియర్ కాలేజీలో చదువుతుండగా, చెల్లెలు ఎనిమిదో తరగతిలో చదువుతోంది. ఈ కుటుంబం కటిక పేదరికంలో జీవిస్తున్నప్పటికీ, వారి ప్రయత్నం, పట్టుదల ఎప్పటికీ తగ్గలేదు.
పాగల శృతి సాధించిన విజయంతో గ్రామ ప్రజలు గర్వపడుతున్నారు. ప్రభుత్వ బడిలో చదివిన ఆమె, కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడి విజేతగా నిలవడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు స్ఫూర్తిగా మారింది.
ఇప్పటికే ట్రిపుల్ ఐటీలో సీటు దక్కినా, ఆర్ధిక భారాలు శృతిని వెనక్కి లాగుతున్నాయి. ఒంగోలు క్యాంపస్‌కి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, హాస్టల్ ఫీజులు ఆమె కుటుంబానికి భరించలేని భారం అయ్యాయి. తల్లి కొంతవరకు సహాయపడగలిగినా, మిగతా అవసరాల కోసం శృతి దాతల దయపై నిరీక్షణలో ఉంది.
ఈ నేపథ్యంలో, మండలంలోని సేవా సంస్థలు, దాతలు ముందుకు వచ్చి శృతికి చదువులో సహాయపడాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆమె వంటి ప్రతిభావంతులకి చేయూతనిస్తే, పేదరికం ముందు ఎంతటి కలలైనా నిజమవుతాయని వాళ్ల నమ్మకం.