పల్నాడు జిల్లా, నరసరావుపేట: నరసరావుపేటలో పోలీసులు ఆకస్మిక తనిఖీలకు దిగారు. పట్టణంలోని ఇస్లాంపేటలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల వివరాలను తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, యజమానుల వివరాలను పోలీసులు పరిశీలించారు.
ఇస్లాంపేటలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘాను మరింత పెంచేందుకు ఈ కార్డాన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
కార్డాన్ సెర్చ్ సందర్భంగా పోలీసులు స్థానికులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.








