కరీంనగర్ జిల్లా: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మానేరు వంతెన సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఆరాధ్యదైవమై కొలువున్నాడన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ యుగపురుషుడని ఆయన కొనియాడారు.తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అప్పుడు దేశంలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీచినా, ఎన్టీఆర్ సారథ్యం లోని టీడీపీ 35 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా ఎన్టీఆర్ అనితర సాధ్యుడని నిరూపించుకున్నారన్నారు. పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం గా నిలవడం పార్లమెంట్ చరిత్రలోనే ఒక రికార్డ్ అని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతిభాశాలైన ఎన్టీఆర్ కు పాలకులు సముచిత గౌరవం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ఆ మహానుభావునికి భారతరత్న ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రొడ్డ, శ్రీధర్, ఎలిమిల్ల కిషన్,పెరుమాండ్ల సతీష్,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.










