ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలిసారి తెలుగు చిత్ర పరిశ్రమపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడుస్తున్నా, ఇండస్ట్రీ సినీపెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలవకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఇండస్ట్రీ అభివృద్ధినే తప్పా, వ్యక్తుల అభివృద్ధిని చూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు తాజా ప్రెస్మీట్లో మాట్లాడారు.
‘తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా పెద్దలు సీఎంను కలువలేదు. సినీపెద్దలు, అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం ఎలా చూసిందో మరిచిపోయారా? అగ్రనటులు, సాంకేతిక నిపుణులకు ఎదురైన ఇబ్బందులు మరిచిపోయారా? చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, ‘మా’ మరిచినట్లున్నాయి. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమాసంఘాల ప్రతినిధులే రావాలి. మా ప్రభుత్వం వ్యక్తులను కాదు. సినీరంగం అభివృద్ధినే చూస్తుంది. అందరూ కలసి రావాలన్న సూచనకు సానుకూలంగా స్పందించలేదు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించే చిత్రాలను ప్రోత్సాహిస్తామని ముందే చెప్పాం. సృజనాత్మక వ్యాపారంలో ఉన్నవారి గౌరవానికి భంగం వాటిల్లకూడదని చెప్పాం. వైసీపీ ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసేది, కక్ష సాధింపులకు దిగేది’ అని పవన్ అన్నారు.