ఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీం భారత్ లాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమూ కష్టం కాదని, అసాధ్యమనేది ఉండదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం దిల్లీలో జరిగింది. అభివృద్ధి వేగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు మోదీ సూచించారు. 2027నాటికి వికసిత్ భారత్‌గా అవతరించేందుకు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే థీమ్‌తో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యమని నినదించారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ మొదటిసారి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్ గురించి చర్చించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరాల నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆవిష్కరణ, స్థిరత్వం అనేది నగరాల అభివృద్ధికి చోదక శక్తులుగా ఉండాలని సూచించారు.
రాష్ట్రాలు ప్రపంచ ప్రమాణాల ప్రకారం కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేసుకోవాలని మోదీ నిర్దేశించారు. అక్కడ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఒక రాష్ట్రం- ఒక ప్రపంచ గమ్యస్థానం అన్న నినాదంతో ముందుకెళ్లాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, యోగి ఆదిత్యనాథ్, సుఖ్విందర్ సింగ్ సుక్కూ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరన్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు హాజరయ్యారు. అలాగే, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్‌తో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.