contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈ విజయం అమరులకు అంకితం.. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (60) ను సాధించిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మాణిక్ రావ్ ఠాక్రేలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

“2009లో డిసెంబరు 3న శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. ఇవాళ డిసెంబరు 3… 2023. నేడు తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానానికి ఘనమైన నివాళి ఇచ్చారు. మలి తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని రాష్ట్ర కాంగ్రెస నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.

ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా మాలో స్ఫూర్తిని నింపారు, మాలో విశ్వాసాన్ని కలిగించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు… కుటుంబ పరమైన అనుబంధం. ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులమే.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటానని, ఎదురొడ్డి పోరాడమని రాహుల్ గాంధీ మాకు భరోసానిచ్చారు. రాహుల్ గాంధీ మద్దతుతో నేను, సీఎల్పీ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ రెడ్డి, మధుయాష్కీ వంటి నేతలందరం కలిసి ఐక్యంగా ఇవాళ ఈ విజయం సాధించాం. సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా వంటి నేతలు కూడా సహకారం అందించారు.

ఈ విజయాన్ని తెలంగాణ అమరులకు అంకితం చేస్తున్నాం. తెలంగాణ అమరుల ఆకాంక్షలను అమలు చేయడానికి, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, తెలంగాణలోని పేదలను ఆదుకోవడానికి, తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఈ విజయమే నాంది. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడుతాం.

ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు అభినందించారు… వారి ప్రకటనను స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పలుకుతాం.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే కాకుండా, రాహుల్ గాంధీ చట్టబద్ధత కల్పిస్తామన్న మిగతా అంశాలపైనా ఆయన మాటను నిలుపుకుంటాం. మా సహజ మిత్రులు, ఎన్నికల్లో మాతో కలిసి పోటీ చేసిన సీపీఐతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయని సీపీఎంను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. సంపూర్ణ సహకారం అందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ప్రభుత్వంలో వాళ్ల ఆలోచనలు కూడా తీసుకుని ముందుకు వెళతాం.

ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి నాది ఒక సూచన. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పాలక పక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు… ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల పాత్రను ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సంప్రదాయానికి, ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని కోరుకుంటున్నాం. గతంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నాలు మళ్లీ జరగబోవని భావిస్తున్నాం.

ఈసారి గతంలో జరిగినట్టుగా ఉండదు… సచివాలయ గేట్లు సామాన్యుడికి కూడా తెరుచుకుని ఉంటాయి. ప్రగతి భవన్ ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుతుంది. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు… ప్రజా భవన్… అది ప్రజల ఆస్తి. దాన్ని ప్రజల కోసమే వినియోగిస్తాం. 2004 నుంచి 2104 వరకు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి స్ఫూర్తిదాయక పాలన ఇచ్చిందో, అదే ప్రేరణతో తెలంగాణలోనూ పరిపాలిస్తాం” అని రేవంత్ రెడ్డి వివరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :