దేశ రక్షణ రంగంలో పనిచేయాలనే కలలుగనే విద్యార్థులకు సువర్ణావకాశం. త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. రాబోయే విద్యా సంవత్సరం (2025-26)లో ఆరు, తొమ్మిది తరగతి ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎన్‌టీఏ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఆసక్తి కలిగిన విద్యార్థులు 2025 జనవరి 13న సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో https://exams.nta.ac.in/AISSEE/ దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర అకాడమీలకు ఇక్కడ శిక్షణ ఇచ్చి విద్యార్థులను సైనికుల్లాగా సిద్ధం చేస్తుంటారు. ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి.
- దేశ వ్యాప్తంగా 190 పట్టణాలు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
- దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు : ఆరోతరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి తప్పక పాసై ఉండాలి.
- దరఖాస్తు ఫీజు : జనరల్, రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు రూ.800 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.650ల చొప్పున నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు తుది గడువు జనవరి 14 రాత్రి 11.50గంటల వరకు ఉంటుంది.
- పరీక్ష సమయం: ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంల నుంచి సాయంత్రం 4.40గంటల వరకు 150 నిమిషాలు ఉంటుంది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు 180 నిమిషాల పరీక్ష ఉంటుంది.
- ఆరోతరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు : ఆరోతరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా కేటాయించారు. లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 150 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు పెట్టారు. జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- తొమ్మిదోతరగతి సబ్జెక్టుల మార్కులు : తొమ్మిదోతరగతి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా ఉన్నాయి. మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : ఈ పరీక్ష రాసే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరంలో ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
For More Details Click: aissee-2025-ib