నార్సింగ్ తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా నార్సింగి మండలం నుండి శాలిపేటకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద ప్రతిపాదిత రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై మంగళవారం కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఎనిమిది గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామ ప్రజలతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు.
రైల్వే బ్రిడ్జి నిర్మాణం ద్వారా ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ దాటే సమయంలో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఈ బ్రిడ్జి అవసరం ఎంతగానో ఉందని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు స్థానిక బీజేపీ నాయకులతో సమావేశమై, ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.








