contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థ!

ఉరుములతో కూడిన వర్షం, తత్సంబంధిత వాతావరణ మార్పులు, పరిణామాలపై ఐదు రోజుల ముందస్తు హెచ్చరికలు, సూచనల వ్యవస్థను కేంద్ర భూగోళ విజ్ఞాన మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా అందించేలా, వాతావరణ శాఖ (ఐ.ఎం.డి.) ద్వారా ఈ వ్యవస్థను అమలు చేస్తారు.

ఇక, పిడుగుపాటు సంభవించబోయే స్థలాన్ని కూడా పసిగట్టగలిగే వ్యవస్థను పుణెలోని భారతీయ ఉష్ణమండల వాతావరణ పరిశోధనా సంస్థ (ఐ.ఐ.టి.ఎం.) స్థాపించింది. కేంద్ర భూగోళ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తితో ఐ.ఐ.టి.ఎం. పనిచేస్తుంది. పిడుగు పడటానికి ఆస్కారం ఉన్న స్థలాన్ని ఎంతో కచ్చితత్వంతో ముందస్తుగానే పసిగట్టి సూచించగలిగే ఈ వ్యూహాత్మక వ్యవస్థను దేశవ్యాప్తంగా 83చోట్ల ఏర్పాటుచేశారు. ఈ మొత్తం వ్యవస్థకు సంబంధించిన సెంట్రల్ ప్రాసెసర్ ఐ.ఐ.టి.ఎం.లో ఏర్పాటై ఉంటుంది. పిడుగుపాటును పసిగట్టగలిగే వ్యవస్థనుంచి సంకేతాలను అందుకునే ఈ సెంట్రల్ ప్రాసెసర్ పరికరం, 500మీటర్ల కంటే తక్కువ కచ్చితత్వంతో పిడుగుపాటు జరగబోయే స్థలాన్ని కనిపెట్టగలుగుతుంది. ఈ వ్యవస్థనుంచి ఉత్పన్నమైన సమాచారాన్ని ఐ.ఎం.డి.కి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తారు. అప్పటికప్పుడు, లేదా అతి సమీప భవిష్యత్తులో సంభవించే పరిణామంపై సమాచారాన్ని అందించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

ఐ.ఎం.డి.లోని జాతీయ వాతావరణ సూచనల కేంద్రంనుంచి ఈ సూచనలు, హెచ్చరికలు సబ్ డివిజనల్ స్థాయికి పంపిస్తారు. ఆలాగే వివిధ రాష్ట్రాల వాతావరణ కేంద్రాలు కూడా ఇవే సూచనలను జిల్లాస్థాయికి చేరవేస్తాయి. దీనికి తోడుగా, ఈవ్యవస్థ ద్వారా,… ఉరుములతో కూడిన భారీ వర్షాలు, జల్లులు, వాతావరణ వైపరీత్యాలపై ముందస్తు సూచనలను అందిస్తారు. ప్రతి 3 గంటలకు ఒకసారి రానున్న 3 గంటల్లో సంభవించే వాతావరణ మార్పులపై సూచనలను ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా, అందిస్తారు. వాతావరణ మార్పులు సంభవించే ప్రాంతాన్ని లేదా జిల్లాను ఆయా రాష్ట్రాల వాతావరణ కేంద్రాలు తెలియజేస్తాయి. ప్రస్తుతానికి, ఈ సదుపాయాన్ని అన్ని జిల్లాలకూ విస్తరింపజేశారు. అంటే, దేశవ్యాప్తంగా 1,084 కేంద్రాలకు ఈ వ్యవస్థను విస్తరింపజేశారు.

పిడుగుపాటుకు సంబంధించి ముందస్తు సమాచారంతో దామిని పేరిట ఒక మొబైల్ యాప్.ను పుణె ఐ.ఐ.టి.ఎం. 2020లో రూపొందించింది. దేశవ్యాప్తంగా సంభవించే పిడుగుపాటు పరిణామాలను అన్నింటినీ ఈ యాప్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎవరైనా వ్యక్తికి సమీపంలో పిడుగుపడే ఆస్కారం ఉన్న పక్షంలో సదరు వ్యక్తిని ఈ యాప్ ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. 20 కిలోమీటర్లనుంచి 40కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతంలో జి.పి.ఎస్. నోటిఫికేషన్ ద్వారా యాప్ తన ముందస్తు సూచనలతో అప్రమత్తం చేస్తుంది. పిడుగుపాటుకు ఆస్కారం ఉన్న ప్రాంతంలో ఎవరైనా వ్యక్తి ఉన్నట్టయితే, ఈ మొబైల్ యాప్ సదరు వ్యక్తిని ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. పిడుగుపాటుపై వివరణాత్మకమైన సూచనలు, ముందు జాగ్రత్త చర్యలను కూడా అందిస్తుంది. పిడుగుపాటుపై తదుపరి 40 నిమిషాలు వర్తించే హెచ్చరికను కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దామిని మొబైల్ యాప్.ను ఐదు లక్షలమందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.

వీటన్నింటితోపాటుగా, పిడుగుపాటు, తత్సంబంధిత అంశాల పరిష్కారానికి జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా ప్రాధికార సంస్థ (ఎన్.డి.ఎం.ఎ.) పలు చర్యలు తీసుకుంది. ఉరుములలతో కూడిన భారీ వర్షాలు, జల్లులు-పిడుగుపాటు, పెనుగాలులు వంటి పరిణామాల విషయంలో అనుసరించిన పద్ధతులపై కార్యాచరణ ప్రణాళికకోసం మార్గదర్శక సూత్రాలను ఎన్.డి.ఎం.ఎ. 2018-19 సంవత్సరంలో జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాగాలకు సదరు మార్గదర్శక సూత్రాలను పంపించింది. ఎన్.డి.ఎం.ఎ. వెబ్ సైట్లో కూడా ఈ మార్గదర్శక సూత్రాలు పొందుపరిచారు.

వీటన్నింటికీ తోడుగా ఈ కింది చర్యలను ఎన్.డి.ఎం.ఎ. తీసుకుంది:

ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగుపాటు తదితర పరిణామాలపై ప్రత్యేక సూచనలను, చేయాల్సిన, చేయకూడని పనులపై తగిన సూచనలను ఎవ్.డి,ఎం.ఎ. జారీ చేసింది. సత్వర చర్యకోసం వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేసింది.
ఉరుములతో కూడిన జల్లులు, పిడుగుపాటు పరిణామాలను ఎదుర్కొనే సన్నద్ధతను, నివారణ చర్యలను గురించి ఎన్.డి.ఎం.ఎ. సమీక్ష జరిపింది. ఇలాంటి వాతావరణ పరిణామాలతో తరచూ ప్రభావితమయ్యే రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమీక్ష నిర్వహించురు.
ఉరుములతో కూడిన జల్లులు, పిడుగుపాటు పరిణామాలపై ముందస్తు హెచ్చరికలను వ్యాప్తి చేయడానికి ఒక ప్రొటోకాల్ వ్యవస్థను ఎన్.డి.ఎం.ఎ. రూపొందించింది.
ఉరుములతో కూడిన వర్షాలు, జల్లులు, పిడుగుపాటు తదితర వాతావరణ పరిణామాల్లో చేయాల్సిన, చేయకూడని పనులకు సంబంధించి పలు సూచనలతో కూడిన ప్రచార సామగ్రిని, కరదీపికలను ఎన్.డి.ఎం.ఎ. తయారు చేసింది.
ప్రత్యేక ప్యానెల్ చర్చ (టెలివిజన్ చర్చాగోష్టి). ‘ఆపదకా సామ్నా’ శీర్షికన దూరదర్శన్ లో కార్యక్రమ నిర్వహణ.
‘ఉరుములతో కూడిన వర్షాలు-పిడుగుపాటు’ వంటి పరిణామాలపై ప్రజాచైతన్యం కోసం దూరదర్శన్, ఆకాశవాణి-ఎన్.డి.ఎం.ఎ. ఉమ్మడిగా 2021వ సవంత్సరం ఏప్రిల్ నెలలో పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాయి. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటుగా, ఈ వాతావరణంతో తరచుగా ప్రభావితమయ్యేందుకు ఆస్కారం ఉన్న రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
ఉరుములతో కూడిన జల్లులు, పిడుగుపాటు సంబంధిత వాతావరణ పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో అవగాహనా కార్యక్రమాలను కూడా ఎన్.డి.ఎం.ఎ. నిర్వహిస్తూ వస్తోంది. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో చేయాల్సిన, చేయకూడని పనుల గురించిన సమాచారాన్ని ఎన్.డి.ఎం.ఎ. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి చిత్రీకరించిన వీడియోలను ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తున్నారు.
కేంద్ర భూగోళ విజ్ఞాన శాఖ సహాయ (ఇన్చార్జి) మంత్రి, సైన్స్ టెక్నాలజీ శాఖమంత్రి జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్ సభకు ఈ సమాచారాన్ని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :