contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తిరుపతిలో తొక్కిసలాటకు అసలు కారణం ఇదేనా ..! భక్తుల ఆవేదన

తిరుపతి : వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎస్ఎస్డి టైం స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భారీ స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ. బుధవారం ఉదయం నుంచి టైం స్లాట్ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటూ వచ్చారు. బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట సాగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అసలు ఈ తొక్కిసలాట జరగటానికి గల కారణం ఏంటి…? అధికారులు ఏం చెప్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు అంటేనే భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. అందుకోను శ్రీవారిని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున దర్శిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రెండు రోజుల్లో శ్రీవారిని దర్శించి… కృప పొందాలని భక్తులు ఆరాటపడుతుంటారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించిన నాటి నుంచి తిరుపతిలో ముందస్తు టోకెన్స్ (ఎస్ఎస్డి) ని అందిస్తూ వస్తుంది టీటీడీ. ప్రతి ఏడాది జారీ చేసే విధంగానే ఈ ఏడాది సైతం టైం స్లాట్ టోకెన్స్ ను తిరుపతిలోని 8 కేంద్రాల్లో టీటీడీ జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అనుకున్న సమయానికి కన్నా… రద్దీ కన్నా భారీ స్థాయిలో భక్తులు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ కేంద్రాలకు భారీ స్థాయిలో చేరుకుంటూ వచ్చారు. క్యూ లైన్ లలోని మొదట భక్తులను 8వ తేదీ అర్ధరాత్రి అనుమతించాలని టీటీడీ భావించింది. టైం స్లాట్ జారీ కేంద్రాల వద్దకు 8వ తేదీ ఉదయం నుంచి భారీ స్థాయిలో భక్తులు రావడం ప్రారంభించారు. గంటల తరబడి టోకెన్ జారీ చేసే కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ వచ్చారు.

ప్రతి కౌంటర్ వద్ద 20 వేల మందికి పైగా చేరుకున్నారు. ముఖ్యంగా బైరాగి పెట్టెడలోని రామానాయుడు స్కూల్, శ్రీనివాసం, విష్ణు నివాసం, జీవకొనలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమయం పెరుగుతున్న కొద్దీ…. రద్దీ పెరుగుతూ వచ్చింది. బైరాగి పెట్టెడలోని రామానాయుడు స్కూల్ కు ఆనుకొని పద్మావతి ఉద్యానవనం ఉండటంతో వస్తున్న భక్తులను ఆ పార్కులోకి తరలించారు. పార్కు మొత్తం పూర్తిగా నిండిపోయింది. 8వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చిన భక్తులను క్యూ లైన్ లో విడుదల చేయకుండా… పార్కులోకి అనుమతించడం ఇంత సమస్యకు దారి తీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. రాత్రి 8.15 గంటల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు. ఆ వ్యక్తికి చికిత్స అందించడాని డీఎస్పీ స్థాయి అధికారి గేట్లు తెరవబోయారు. భక్తులు మాత్రం క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలామంది కిందపడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికే నలుగురు మృతి చెందినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. బైరాగిపట్టెడ వద్ద జరిగిన ఘటనలోనే ఐదుగురు చనిపోవడం గమనార్హం.

భారీ స్థాయిలో జరిగిన ఈ తొక్కిసలాటలో 48 మంది భక్తులు గాయాలపాలయ్యారు. 12 మంది స్విమ్స్ లో వైద్య సేవలు పొందుతున్నారు. మరో 36 మందికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్సులు అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా వస్తున్న వచ్చాయి. బంధువుల రోదనలతో రుయా ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, ఆర్డీవో రామమోహన్ ఆసుపత్రిలోనే ఉండి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు అందరినీ హుటాహుటిన రప్పించారు. గతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి, అక్కడ పరిస్థితిని అనుసరించి భక్తులను క్యూలైన్లలోకి వదిలేవారు. ఎన్నడూ లేని విధంగా బైరాగిపట్టెడ టోకెన్ల కేంద్రం వద్ద ఉన్న పార్కులోకి భక్తులను అనుమతించారు. మధ్యాహ్నం నుంచి అక్కడే కూర్చుని ఉండటంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పార్కులో ఎక్కువ మంది ఉండటం.. వారంతా ఒక్కసారిగా వెలుపలికి వచ్చేందుకు గేటును తోయడంతో కిందపడిపోయారు. అదే సమయంలో భారీ స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకొని విషాద ఘటనకు దారి తీసింది.

Tirupati Stampede Live: Toll rises to 6; CM Naidu to meet injured persons  and families of the dead on Thursday | Hindustan Times

తొక్కిసలాటకు సంబంధించి సీసీ ఫుటేజ్ కీలకం కానుంది. ఒక్కసారిగా తొక్కిసలాట జరగటానికి గల కారణాలను సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. కొందరు భక్తుల అత్యుత్సాహమే ఈ ఘటనకు కారణం అయ్యుంటుందని భావిస్తున్నారు. పరిణామాలపై సమగ్ర నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకి సమర్పించనున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు… అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారులు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతికి చేరుకొని సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు పరామర్శించి, మృతుల కుటుంబాలకు బాసటగా నిలవనున్నారు. ఈ ఘటనపై ఈవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

రుపతి తొక్కిసలాటపై ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి:

ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది బాధాకర ఘటన అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎక్స్ వేదికగా స్పందించిన జైశంకర్

తిరుపతిలో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తీవ్రంగా కలచివేసింది: తెలంగాణ సీఎం

తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వారి మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

దిగ్భ్రాంతికరం: కిషన్ రెడ్డి

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు వైద్య సాయం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

బండి సంజయ్ దిగ్భ్రాంతి

తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.

తిరుపతిలో చంద్రబాబు పర్యటన… ఇదీ షెడ్యూల్

తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తిరుపతిలో పర్యటించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆయన పరిహారం ప్రకటిస్తారు.

చంద్రబాబు తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది…

  • ఈరోజు ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
  • గం.11.10 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • గం.11.15 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం నుంచి విమానంలో తిరుపతికి బయలుదేరుతారు.
  • గం.12.00కు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • గం.12 నుంచి గం.3 వరకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఈవో, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
  • ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరుతారు.
  • మధ్యాహ్నం గం.3.00కు తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.
  • గం.3.45 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • గం.3.50కి విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు.
  • సాయంత్రం గం.4.00కు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :