- జర్నలిజం విలువలను నిలువునా పూడ్చేస్తున్న ‘నకిలీ’ పాత్రికేయులు
- అధికారులను బురిడీ కొట్టిస్తూ ఇంటర్వ్యూలు… సీక్రెట్ ఎంక్వైరీకి డిమాండ్!
తిరుపతి జిల్లా, పాకాల: జర్నలిజం రంగాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నకిలీ రాయబారులు చేస్తున్న అక్రమాలు హద్దులు దాటుతున్నాయి. ఒకే వ్యక్తి, ఒకే అక్రిడేషన్ కార్డ్‌తో పదుల సంఖ్యలో వివిధ ఛానెళ్ల మైకులను ముందర పెట్టుకుని బెదిరింపులకు, ధనార్జనకు పాల్పడుతున్న ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.
ఒకే అక్రిడేషన్… 8 మైకులు! ఒక టీవీ ఛానెల్ పేరిట అక్రిడేషన్ పొందిన ఒకే ఒక్క జర్నలిస్ట్, దేవాదాయ శాఖ పరిధిలోని ఒక ఈవో (EO), ఛైర్మన్‌ను ఇంటర్వ్యూ చేస్తూ ఏకంగా 8 మైకులను టేబుల్‌పై పరిచి హల్చల్ చేయడం విస్తుగొలుపుతోంది. 8 మంది విలేకరులు హాజరుకావాల్సిన సదరు సమావేశంలో లేదా ఇంటర్వ్యూలో, ఒక్కడే అన్ని మైకులను మెయింటైన్ చేస్తూ వార్తలను తస్కరించడం ఏ తరహా జర్నలిజమని నిజమైన విలేకరులు ప్రశ్నిస్తున్నారు.
ధనదాహంతోనే ఈ మాయాజాలం! అక్రమ సంపాదన, బ్లాక్‌మెయిలింగ్ కోసమే ఇలా ఒకే వ్యక్తి పదుల సంఖ్యలో ఛానెళ్ల మైకులను వాడుతూ అక్రమ దందా సాగిస్తున్నాడని తెలుస్తోంది. గతంలో కూడా సదరు వ్యక్తికి మైకుల దుర్వినియోగంపై సీఐ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అతని తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ, వ్యవస్థలను బురిడీ కొట్టిస్తున్న ఇటువంటి వారి వెనుక ఉన్న అసలు సూత్రధారులపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
సమగ్ర విచారణకు డిమాండ్:
ఒకే వ్యక్తికి ఇన్ని మైకులు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అధికారులు ఎలా అంగీకరించారు?
వారు సదరు వ్యక్తికి ఏ రకంగా కొమ్ముకాస్తున్నారు?
ఇది నిజమైన జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం కాదా?
ఈ వ్యవహారంపై సమగ్రమైన సీక్రెట్ ఎంక్వైరీ (రహస్య విచారణ) జరిపి, నకిలీ దందాలు నడుపుతున్న వ్యక్తులపై అలాగే వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా రంగానికి చెందిన ప్రతినిధులు, సభ్యసమాజం డిమాండ్ చేస్తోంది.









