మాజీ మంత్రి, వైసిపి పార్టీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో విచారించిన ధర్మాసనం 14 రోజులు రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో కాకాణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య నెల్లూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి కాకాణిని వెంకటగిరిలోని కోర్టుకు తరలించారు. తొమ్మిది పోలీసు వాహనాల్లో, ప్రత్యేక పోలీసు బలగాలు మధ్య వెంకటగిరికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎదుట కాకాణిని హాజరుపరిచారు.
కోర్టు ప్రాంగణంలోకి వైఎస్సార్సీపీ నేతలు: ముందుగా కాకాణిని నెల్లూరు నుంచి కోర్ట్‌కు తీసుకొచ్చే ముందు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు వైఎస్సార్సీపీ నాయకుడు ఆనం విజయ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులని వెంటబెట్టుకొని కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు.
అంతకు ముందు వైఎస్సార్సీపీ నేతలు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు పర్వతరెద్ది చంద్రశేఖర్ రెడ్డి, మెరిగ మురళి తమ తమ శ్రేణులతో కలసి రావడంతో పోలీసులు అడ్డుకుని పరిమిత సంఖ్యలో ప్రాంగణంలోకి పంపారు. 144వ సెక్షన్ విధించామని చెప్పి పోలీసులు వైఎస్సారీసీపీ నేతలను అక్కడి నుంచి పంపేప్రయత్నం చేశారు. అదే విధంగా శాంతి భద్రతల దృష్ట్యా మీడియానూ కోర్ట్ ప్రాంగనానికి దూరంగా ఉంచారు. కోర్టు ప్రాంగణంలో బారికెడ్లు పెట్టి ఎవరినీ లోపలికి వదలకుండా నియంత్రణ చేశారు.
55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలించాయి. చివరకు కాకాణి బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్లు పసిగట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. బెంగళూరు సమీపంలో కాకాణిని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు.










