contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకిస్తాన్ గూఢచారిగా సీఆర్పీఎఫ్ జవాన్ .. అదుపులోకి తీసుకున్న అధికారులు

పాకిస్థాన్ గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూసిన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గూఢచారులను అరెస్టు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో గూఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు డబ్బుకోసం పాక్ కు రహస్యాలు చేరవేస్తుండగా మరికొందరు హనీట్రాప్ లో చిక్కి ఈ పని చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ గూఢచారుల జాబితాలో ఓ జవాను ఉన్నట్లు తేలడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దేశ రక్షణ కోసం పనిచేసే సీఆర్ పీఎఫ్ జవాను ఒకరు డబ్బు కోసం పాకిస్థాన్ కు అమ్ముడుపోయాడని, కీలకమైన రహస్యాలు మన శత్రు దేశానికి చేరవేశాడని అధికారులు గుర్తించారు.

సదరు జవాన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలు “జాతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని” వ్యాఖ్యానించింది. “ఈ ఆరోపణలు జాతీయ భద్రతకు, భారతదేశాన్ని సందర్శించే పౌరుల ప్రాణాలకు, అలాగే భారత పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించేవి” అని కోర్టు పేర్కొంది. నిందితుడు పాకిస్థాన్‌కు ఎలాంటి సమాచారం చేరవేశాడన్న వివరాలను రాబట్టడం అత్యంత కీలకమని అభిప్రాయపడిన కోర్టు, జవాన్‌ను జూన్ 6 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. “దేశ బలానికి, భద్రతకు సాయుధ బలగాలే మూలస్తంభాలు. వాటికి కోలుకోలేని నష్టం కలిగించే ఎలాంటి ప్రయత్నమైనా దర్యాప్తు చేయాల్సిన తీవ్రమైన విషయం” అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

నిందితుడిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 15 (ఉగ్రవాద చర్యకు పాల్పడటం), సెక్షన్ 16 (ఉగ్రవాద చర్యకు శిక్ష), సెక్షన్ 18 (కుట్ర మరియు సంబంధిత చర్యలకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన ఘటన నేపథ్యంలో, పాకిస్థాన్‌కు సమాచారం అందిస్తున్న గూఢచారులు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :