ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఎటువంటి ఒప్పందం జరగాలన్నా ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు.
“ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి. ఆ తర్వాత అక్కడ గొప్ప, ఆమోదయోగ్యమైన నాయకత్వం రావాలి. అప్పుడు మేము, మా మిత్రదేశాలు కలిసి ఇరాన్‌ను వినాశనం అంచుల నుంచి బయటకు తీసుకొస్తాం. ఆర్థికంగా మునుపటి కంటే బలంగా తీర్చిదిద్దుతాం. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్తు ఉంటుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఎన్నికల నినాదాన్ని ప్రస్తావిస్తూ “మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్” అంటూ కొత్త నినాదాన్ని వినిపించారు.
ఇదిలా ఉండగా, అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధ వాతావరణం నెలకొంది. క్షిపణి దాడులు, నావికాదళ చర్యలతో మధ్యప్రాచ్య ప్రాంతం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు తీవ్రతరం చేయగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు కొనసాగిస్తోంది.
కొన్ని రోజుల క్రితం హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ధనౌకను అమెరికా సబ్‌మెరైన్ దాడి చేసి ముంచివేసిన ఘటనతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో వెయ్యి మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్ మరియు లెబనాన్‌లలో డజన్ల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. టెహ్రాన్‌పై బాంబుల దాడులు కొనసాగుతుండటంతో వేలాది మంది ప్రజలు రాజధానిని వదిలి వెళ్లిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు ట్రంప్ యుద్ధ అధికారాలను నియంత్రించే ప్రయత్నాలను వాషింగ్టన్‌లో సెనేట్ రిపబ్లికన్లు అడ్డుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికా బలగాలు నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా భవిష్యత్తులో ఆ అవకాశాన్ని వైట్‌హౌస్ కొట్టిపారేయలేదు.
ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై కూడా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో దాడుల భయంతో నౌకల రాకపోకలు తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరాయి. భద్రతా కారణాల దృష్ట్యా పలు షిప్పింగ్ సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి.








