మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ వృద్ధుడి దీనస్థితి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావును కదిలించింది. నడవలేని స్థితిలో పోలీస్ కార్యాలయానికి వచ్చిన వృద్ధుడి వద్దకే స్వయంగా వెళ్లి ఆయన సమస్యను తెలుసుకుని తక్షణ చర్యలకు ఆదేశించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన భద్రయ్య (75) తన సమస్యను వివరించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఆయన నడవలేని స్థితిలో ఉండటాన్ని రిసెప్షన్ సిబ్బంది సరిత గమనించి వెంటనే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి భద్రయ్యను ఆప్యాయంగా పలకరించి ఆయన సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ, తనకు చెందిన 36 గుంటల భూమిని తన ఇద్దరు కుమారులు నోముల రాజు, నోముల శ్రీనివాస్ తనకు తెలియకుండా తమ పేర్లపై అక్రమంగా పట్టా పుస్తకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన కుమార్తె లావణ్యను ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, తనను సరిగా చూసుకోవడం లేదని, అన్నం కూడా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
వృద్ధుడి బాధను సానుభూతితో విన్న జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. సమస్యపై సమగ్ర విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్‌రెడ్డికి ఫోన్ ద్వారా ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా విచారించి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








