నర్సాపూర్/తూప్రాన్ : ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగును రైతులు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, రైతులతో మాట్లాడి అందుబాటులో ఉన్న విత్తనాలు, వ్యవసాయ సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. ప్రాంతాల వారీగా నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా పెరుగుతాయని తెలిపారు.
“నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది” అనే లక్ష్యంతో ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై రైతులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచిందని తెలిపారు. రైతులు సమీప రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలకు హాజరై వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సమీకృత (ఇంటిగ్రేటెడ్) వ్యవసాయం అవసరమని పేర్కొన్న కలెక్టర్, వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక రంగం, కూరగాయల సాగు వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను చేపడితే రైతులకు ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుందని వివరించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చన్నారు.
కూరగాయల సాగు ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యానవన పంటలను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. పశుసంపద అభివృద్ధికి అవసరమైన మేత పంటల సాగుపై ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ఉద్యానవన పంటలు, ప్రత్యామ్నాయ పంటలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులకు అవసరమైన ప్రతి విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ భరోసా కల్పించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేలా రైతులు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నర్సాపూర్ నియోజకవర్గంలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వర్షాధార పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను కోరారు.
అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే విత్తన మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి విత్తనాల నాణ్యత, సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.







