అంతర్జాతీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఏడో రోజుకు చేరుకోవడంతో శుక్రవారం దలాల్ స్ట్రీట్‌లో భారీ పతనం నమోదైంది. ఆయిల్ ధరలు పెరగడం, యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సూచీలు కుప్పకూలాయి.
మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్ 1,097 పాయింట్లు కోల్పోయి 78,918 వద్ద స్థిరపడింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 315 పాయింట్లు పడిపోయి 24,450 వద్ద ముగిసింది.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 2.15 శాతం పతనమై 57,783 వద్దకు చేరింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.
సెక్టార్ల వారీగా పరిశీలిస్తే ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్‌యు బ్యాంకులు, రియల్టీ రంగాలు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు మాత్రం స్వల్ప లాభాల్లో ముగిశాయి. యుద్ధ వాతావరణం కారణంగా డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లలో మాత్రం మంచి కొనుగోళ్లు కనిపించాయి. ఎన్ఎస్ఈలో పలు డిఫెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు 9 శాతం వరకు లాభపడటం గమనార్హం.
ఇరాన్ క్షిపణి దాడులతో బహ్రెయిన్‌లోని ఆయిల్ రిఫైనరీ దెబ్బతినడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 86 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతుండగా, అమెరికన్ క్రూడ్ ధర 81 డాలర్లు దాటింది.
చమురు ధరల పెరుగుదలతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.09 శాతం తగ్గి 91.84 వద్ద ముగిసింది. మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో ఇండియా వీఐఎక్స్ సూచీ 11 శాతం పెరిగింది. ప్రస్తుతం నిఫ్టీకి 24,500 పాయింట్లు కీలక మద్దతు స్థాయిగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.








