గుత్తి, అనంతపురం జిల్లా: గుత్తి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు మరియు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కార్మికులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు సిపిఎం పలు విభాగాల నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని, కార్మికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం వెంటనే కల్పించాలని కోరారు.
కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం సిపిఎం పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లేశు, చందు, రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కార్మికుల నాయకులు సూర్యనారాయణ, రాజు, స్వామి, మధు, రామాంజనేయులు, రవి, మహేష్, నరసింహ, మురళి తదితరులు పాల్గొన్నారు.








