జియ్యమ్మవలస : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని బాసింగి నిర్వాసితుల నివాస స్థలాల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం గుర్తించిన ప్రాంతంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
బిట్రపాడు పంచాయతీ పరిధిలోని భట్లభద్ర రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం సేకరించిన సుమారు 32.56 ఎకరాల భూభాగంలో ప్రత్యేక లేఅవుట్‌ను సిద్ధం చేశారు. ఈ లేఅవుట్లో మొత్తం 384 నిర్వాసిత కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తహశీల్దార్ (ఎమ్మార్వో) నీలాపు అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
తహశీల్దార్‌కు ఘన సన్మానం
నిర్వాసితుల సమస్యను అర్థం చేసుకుని, ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు తహశీల్దార్ నీలాపు అప్పారావును నిర్వాసితులు ఘనంగా సన్మానించారు. మండల రామకృష్ణ, సుందర్ రావు, పోల శంకర్రావుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, నిర్వాసితులు కలిసి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ), వీఆర్వోలు, మండల సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బాసింగి గ్రామ నిర్వాసితులు హాజరయ్యారు. పట్టాలు అందుకున్న నిర్వాసితులు తమ సొంతింటి కల నెరవేరబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.








