- కాలువలు, నాలాలపై అక్రమ నిర్మాణాలు – ప్రజలు ఆందోళన
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని కాగజ్నగర్ పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు బురుదగూడ గ్రామ పంచాయతీ పరిధిలో కాలువలు, నాలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన కాలువలు, డ్రైనేజీ మార్గాలను కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కాలువలు మూసుకుపోవడంతో మురికి నీరు నిలిచిపోతూ పరిసర ప్రాంతాల్లో దోమల విపత్తు పెరుగుతోందని, దుర్వాసన వ్యాపించి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని, మురికి నీరు వెళ్లే దారి లేక ఇళ్ల వద్దే నిల్వవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నాలాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.









