కరీంనగర్ జిల్లా: కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్లే బైపాస్ రోడ్డులో వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు గుంతల (పోత్‌హోల్స్) మరమ్మత్తులకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం ఆయన సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
బైపాస్ రోడ్డులో ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న గుంతలను గుర్తించి, వాటి తీవ్రతను ఏసీపీ స్వయంగా పరిశీలించారు. రోడ్డు ఇంజనీర్లతో సమన్వయం చేసుకుంటూ మరమ్మత్తులకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వాహనదారులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా, రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏసీపీ తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటస్వామి మాట్లాడుతూ, “ప్రజా భద్రత మా ప్రధమ కర్తవ్యం. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో పాడైన ప్రాంతాలను వెంటనే మరమ్మత్తు చేసి వాహనదారులు సాఫీగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి” అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్‌రావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, రోడ్డు ఇంజనీర్లు, సంబంధిత విభాగాల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.








