కరీంనగర్ జిల్లా: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ప్రధానంగా ఆటోలపై దృష్టి సారించిన పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, టాప్ నంబర్లు ప్రదర్శించకపోవడం, వాహన ధ్రువపత్రాలు (ఆర్‌సి, ఇన్సూరెన్స్) లేకపోవడం, నెంబర్ ప్లేట్లు సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 57 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు, డ్రైవర్లపై మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అవసరమైన పత్రాలు ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలని హెచ్చరించారు.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో రిజర్వు ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్సై ప్రమోద్ రెడ్డితో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.








