జిల్లాలో అనధికార లేఅవుట్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. అనుమతి పొందిన లే అవుట్లలోనూ అభివృద్ధి కనిపించడం లేదు. కొద్దిమంది రియల్టర్లను మినహాయిస్తే జిల్లాలో కొనుగోలుదారులకు కుచ్చుటోపి పెట్టే రియల్టర్లే అధికంగా ఉన్నారు. హనుమకొండ ప్రాంతం లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ పేరుతో కొందరు కోట్లు దండుకున్నారు… ఓ జవాన్ ని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది …
- ఇల్లు కూల్చివేతతో ఆర్థిక, మానసిక వేదన… నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతి
హనుమకొండ జిల్లా: ఓపెన్ ప్లాట్ కొనుగోలు విషయంలో మోసపోయి భారీ నష్టానికి గురైనట్టు ఓ CRPF జవాన్ ఆరోపిస్తూ అధికారులను ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
బాధితుడు కాటం శ్రీకాంత్ (36), రాజమౌళి కుమారుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో ఉన్న GC, CRPFలో జవాన్‌గా పనిచేస్తున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ జిల్లా హస్సన్‌పర్తి గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణమూర్తి (సాంబయ్య కుమారుడు), సంగాల రాజేష్ (లింగయ్య కుమారుడు) వద్ద నుంచి 2018 ఆగస్టు 29న సర్వే నంబర్ 598/Dలో ఉన్న 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను రూ. 8 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్లు ఇప్పటివరకు ఇవ్వలేదని ఆయన తెలిపారు.
తదుపరి 2019లో సుమారు రూ. 6 లక్షల వ్యయంతో ఆ స్థలంలో ఇల్లు నిర్మించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) నుంచి హౌస్ నంబర్ 55-3-699/5/1/2కు ఓనర్షిప్ సర్టిఫికేట్ కూడా పొందారు. ఇల్లు నిర్మాణం తర్వాత ఆన్‌లైన్ ద్వారా హౌస్ ట్యాక్స్ చెల్లిస్తూ వచ్చానని తెలిపారు.
అయితే 2023 జూలై 1న GWMC కాజీపేట్ సర్కిల్-II కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసు అందిందని, దానికి సమాధానం ఇవ్వకముందే 2024 జూన్ 24న అధికారులు JCB సహాయంతో తన ఇంటిని కూల్చివేశారని శ్రీకాంత్ వాపోయారు.

తదుపరి విచారణలో గ్రామ మ్యాప్ ప్రకారం 598/D సర్వే నంబర్ స్థానంలో 642 సర్వే నంబర్ భూమిని చూపించి మోసం చేసినట్లు తెలిసిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై 2025 ఆగస్టు 18న హనుమకొండ MROకు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రం పంపినా స్పందన రాలేదని చెప్పారు.
తనకు జరిగిన అన్యాయం నేపథ్యంలో కందుకూరి కృష్ణమూర్తిని స్థానిక పెద్దల సమక్షంలో ప్రశ్నించగా, నష్టపరిహారంగా నాగారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 98/D/1లో 240 చదరపు గజాల భూమి ఇస్తామని అగ్రిమెంట్ చేసారని తెలిపారు. అయితే ఆ భూమికి సంబంధించిన ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ (EC) పరిశీలించగా ఆ భూమి వేరే వ్యక్తుల పేర్లపై ఉందని తెలిసిందని, దీంతో రెండోసారి కూడా మోసం చేయడానికి ప్రయత్నించినట్టు వెల్లడించారు.
తదుపరి వారాల కుల సంఘం పెద్దలను ఆశ్రయించగా, వారు కృష్ణమూర్తిని పిలిపించి విచారణ జరిపారని తెలిపారు. ఈ సందర్భంగా 598/D సర్వే నంబర్‌లోనే తిరిగి ఇల్లు నిర్మించి అప్పగిస్తానని హామీ ఇచ్చినా, ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదని బాధితుడు పేర్కొన్నారు.
దేశ సేవలో భాగంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో ప్లాట్ కొనుగోలు చేశానని, కానీ కందుకూరి కృష్ణమూర్తి మోసం కారణంగా ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయానని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన అధికారులను వినమ్రంగా కోరారు.









