కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో పదవులు శాశ్వతం కాదని, ఇవి వస్తుంటాయని, పోతుంటాయని అన్నారు. పదవి వచ్చిన వారు అతిశయపడకుండా, రానివారు నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తించే పార్టీ అని పేర్కొంటూ, ఇది తల్లిలాంటి పార్టీ అని అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనం అందేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








