contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సాయికృష్ణ అదృశ్యం కేసు: సీఐ నాగరాజు సస్పెన్షన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, జూన్ 18: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఘటనపై ఉన్నతస్థాయి, నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

సింగపూర్ పర్యటన ముగించుకుని బుధవారం రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి, సచివాలయంలో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.

సమావేశంలో సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించిన పరిణామాలను సీఎం సవివరంగా సమీక్షించారు. కేసు దర్యాప్తులో పారదర్శకత ఉండాలని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారి హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణపై గతంలో కొన్ని నేరారోపణలు నమోదైనట్లు సమాచారం. అయితే మే 9న మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జూన్ 29లోగా సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

కేసు నేపథ్యంలో ఇప్పటికే సీఐ నాగరాజును విధుల నుంచి తప్పించి వీఆర్‌కు బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అదృశ్యం ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారితో ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, పూర్తి స్థాయి విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి రావాలని ప్రజలు, మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :